Hyderabad: డ్రంకెన్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష తప్పిస్తానంటూ రూ.50 వేలు నొక్కేసిన లాయర్!
- తాగి కారు నడుపుతూ దొరికిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
- మూడు రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు
- లాయర్‌ను ఆశ్రయిస్తే మోసం చేసిన వైనం
డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తిని జైలుకెళ్లకుండా చేస్తానని నమ్మించి రూ.50 వేలు నొక్కేసిన లాయర్‌ను హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. చందానగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆర్.వెంకటపవన్ కుమార్ గత నెల 16న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిపై డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
పవన్‌కుమార్‌కు కోర్టు గత నెల 19న మూడు రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో జైలుకెళ్తే పరువు పోతుందని భావించిన పవన్.. జైలు శిక్ష తప్పించాల్సిందిగా కోరుతూ కేపీహెచ్‌బీకి చెందిన లాయర్ భానుప్రసాద్‌ను ఆశ్రయించాడు. అంతా విన్న లాయర్ రూ.70 వేలు ఇస్తే జైలు శిక్ష తప్పించడంతోపాటు పోలీసులు సీజ్ చేసిన కారును కూడా విడిపిస్తానని భరోసా ఇచ్చాడు.
అంతడబ్బు ఇచ్చుకోలేనంటూ రూ.50 వేలకు పవన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, వెంటనే అంతడబ్బు సమకూరకపోవడంతో తన చేతికి ఉన్న యాపిల్ స్మార్ట్‌వాచ్‌తోపాటు రూ.15 వేల నగదు ఇచ్చాడు. అవి తీసుకున్నప్పటికీ భానుప్రసాద్ నుంచి ఎటువంటి స్పందన లేకపోయింది. ఈలోపుగా కోర్టు తీర్పు ప్రకారం పోలీసులు గత నెల 29 నుంచి 31 వరకు పవన్‌ను జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన పవన్.. తనను మోసం చేసిన లాయర్ భానుప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం లాయర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.