Jagan: ఆ ప్రకటనలేంటి? ఈ గందరగోళమేంటి?: జగన్‌పై నాదెండ్ల మనోహర్ విమర్శల వర్షం

  • సీఎం స్పందించాల్సిన విషయంలో మంత్రులు మాట్లాడడమా?
  • ఈ వందరోజుల్లో ఏదైనా చేశామని మీకు అనిపిస్తోందా?
  • అమరావతిని మార్చే నైతికత, అధికారం మీకు లేవు 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ విమర్శల వర్షం కురిపించారు. రాజధాని తరలింపు విషయంలో మంత్రులు చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయని, ఈ విషయంలో మీరెందుకు స్పందించడం లేదో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాజధానిపై అవగాహన లేమితో మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ స్పందించాల్సిన విషయంలో వారు మాట్లాడుతుండడం సీఎం అసమర్థతగా భావించాల్సి వస్తోందన్నారు. పరిపాలన విషయంలోనూ జగన్ చేసింది శూన్యమేనన్నారు. ఈ వంద రోజుల్లో ఏదైనా చేశామని మీకైనా అనిపిస్తోందా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని మార్చే నైతికత, అధికారం జగన్‌కు లేనేలేవని, ఇప్పటికే అక్కడ రూ.8,400 కోట్లు పెట్టుబడిగా పెట్టారని అన్నారు. కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయని నాదెండ్ల పేర్కొన్నారు.

పెట్టుబడులు పెట్టేవారిపై కేసులుపెట్టి భయపెట్టడం ఎక్కడి సంస్కృతో చెప్పాలని జగన్‌ను నిలదీశారు. రైతులు తమ భూములు ఇచ్చింది పార్టీ కోసం కాదని, రాజధాని కోసం ఇచ్చారన్న సంగతిని మర్చిపోవద్దన్నారు. భూములిచ్చి తాము చేసిన త్యాగం వృథా అవుతుంటే వారు బాధతో కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు జనసేన కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం జనసేన అధినేత పవన్ త్వరలో కార్యాచరణ ప్రకటించనున్నట్టు మనోహర్ తెలిపారు.

Jagan
Andhra Pradesh
amaravathi
nadendla manohar
  • Loading...

More Telugu News