Telugudesam: ఎన్ని అడ్డంకులు ఎదురైనా 11న 'ఛలో ఆత్మకూరు' నిర్వహిస్తాం: టీడీపీ నేతల స్పష్టీకరణ

  • 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం తలపెట్టిన టీడీపీ
  • మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు
  • పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న ఆనంద్ బాబు
  • అక్రమ కేసులు ఎత్తివేయకపోతే కోర్టు జోక్యం చేసుకుంటుందన్న కనకమేడల

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు అంటూ 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో ఉంది.  ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఈ నెల 11న 'ఛలో ఆత్మకూరు' చేపట్టి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమంపై టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. పల్నాడులో వైసీపీ బాధితులను ప్రభుత్వం గుర్తించీ గుర్తించనట్టుగా నటిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. పోలీసులు విధి నిర్వహణలో ఒకరి పక్షాన కొమ్ముకాయాల్సిన పనిలేదని హితవు పలికారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పోలీసులను కోరుతున్నామని అన్నారు. అక్రమ కేసులు ఎత్తివేసి దాడికి పాల్పడ్డవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇక, టీడీపీ న్యాయవిభాగం చీఫ్, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ, ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను తీసుకెళ్లామని పోలీసులే చెబుతున్నారని, తద్వారా కొందరు వ్యక్తులు ఊరు వదిలేసి వెళ్లినట్టు పోలీసులు అంగీకరించినట్టే కదా? అని అన్నారు. వాళ్లు ఎవరి కారణంగా ఊరు వదిలి వెళ్లారు? వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడంలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం కోసమే 144 సెక్షన్ విధించారని కనకమేడల ఆరోపించారు. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలని, అలా జరగకపోతే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News