Chandrayaan 2: చంద్రయాన్-2 చారిత్రాత్మకం: పాకిస్థాన్ తొలి మహిళా వ్యోమగామి ప్రశంసలు
- చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు చేసిన ప్రయత్నం అద్భుతం
- ఇది దక్షిణాసియా సాధించిన విజయం
- సైంటియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమీరా సలీమ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ చరిత్రాత్మకమైనదని పాకిస్థాన్ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీమ్ ప్రశంసించారు. కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న డిజిటల్ సైన్స్ మేగజీన్ 'సైంటియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు స్పందించారు.
చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం అద్భుతమని కొనియాడారు. చంద్రయాన్-2 ప్రయోగం దక్షిణాసియా సాధించిన విజయమని చెప్పారు. ప్రపంచ అంతరిక్ష రంగమంతా ఈ ప్రయోగం పట్ల గర్వంగా ఉందని అన్నారు. అంతర్జాతీయ రంగంలో దక్షిణాసియా ప్రాంతంలోని ఏ దేశం ముందడుగు వేసినా... అది ఈ ప్రాంతమంతటికీ గర్వకారణమేనని చెప్పారు. ప్రైవేటు అంతరిక్ష పరిశోధనా సంస్థ వర్జిన్ గ్యాలాక్టిక్ పంపే వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నమీరా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెను పాక్ ప్రభుత్వం 'పాకిస్థాన్ తొలి వ్యోమగామి'గా అభివర్ణించింది.