French rooster: ఫ్రాన్స్ లో కోడిపుంజు న్యాయపోరాటం.. కోర్టు మెట్లెక్కి విజయం సాధించిన ‘మౌరైస్’!

  • ఫ్రాన్స్ లోని సెయింట్ పైర్రే డీ ఓలిరాన్ లో ఘటన
  • కోడి కూతలపై స్థానికుల ఆగ్రహం
  • సివిల్ కోర్టును ఆశ్రయించిన ఇరుగుపొరుగువారు

సాధారణంగా పల్లెల్లో అయితే ఉదయాన్నే కోడి కూతతో తెల్లవారుతుంది. అయితే కొందరికి మాత్రం కోడి కూతలు, పక్షుల అరుపులు అస్సలు నచ్చవు. తాజాగా ఫ్రాన్స్ లో ఓ కోడిపుంజు తన హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించింది. ఈ ఘటన ఫ్రాన్స్ లోని ఓలిరాన్ దీవిలో చోటుచేసుకుంది. ఈ ద్వీపానికి పర్యాటకులు చాలామంది వస్తుంటారు. ఈ క్రమంలో సెయింట్ పైర్రే డీ ఓలిరాన్ గ్రామంలో కోర్నీ ఫెస్సౌ అనే మహిళ ‘మౌరైస్’ అనే కోడి పుంజును పెంచుకుంటోంది. అయితే ఇది ప్రతిరోజూ ఉదయాన్నే కూతపెట్టేది. దీంతో ఈ అరుపులతో విసుగు చెందిన ఇరుగుపొరుగువారు ఈ ఏడాది జూలైలో స్థానిక సివిల్ కోర్టును ఆశ్రయించారు.

ఈ కోడిపుంజు అరుపులతో తమకు నిద్రపట్టడం లేదనీ, కాబట్టి ఈ అరుపులను ఆపేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. ఈ కూతలతో పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన ఫ్రెంచి కోర్టు.. ఇరుగుపొరుగువారి ఆరోపణలను తిరస్కరించింది. అంతేకాకుండా కోడిపుంజు యజమానిని కోర్టు వరకూ రప్పించి ఇబ్బంది పెట్టినందుకు రూ.78,677 చెల్లించాలని ఆదేశించింది. కాగా, కోర్టు తీర్పుపై పుంజు యజమాని  కోర్నీ ఫెస్సౌ హర్షం వ్యక్తం చేసింది.

అన్నట్లు ఈ కేసు విచారణ సందర్భంగా చాలా వింతలే చోటుచేసుకున్నాయి. మౌరైస్ పుంజుకు మద్దతుగా ఫ్రాన్స్ లో సంతకాల సేకరణ చేపట్టగా, దాని హక్కులను కాపాడాలని ఏకంగా 1,40,000 మంది సంతకాలు చేశారు. ఇక చాలామంది ప్రజలు కోర్టుకు తమ కోడిపుంజులను పట్టుకొచ్చి సంఘీభావం తెలియజేశారు. దీంతో ప్రజల మూడ్ ను గమనించిన స్థానిక మేయర్ క్రిస్టోఫ్ సువర్ కూడా మౌరైస్ కే మద్దతు పలికారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News