Australia: రగ్బీ మ్యాచ్ కు ముందు ఘోర తప్పిదం... అర్జెంటీనా జాతీయగీతం బదులు రాక్ సాంగ్ ప్లే చేసిన డీజే!
- ఆస్ట్రేలియాలో ఘటన
- నివ్వెరపోయిన అర్జెంటీనా ప్లేయర్స్
- కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన నిర్వాహకులు
అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు జరిగే సమయంలో మ్యాచ్ కు ముందు ఆయా జట్ల జాతీయగీతాలను ప్లే చేయడం ఆనవాయితీ. అయితే, అర్జెంటీనా, రాండ్ విక్ జట్ల మధ్య సిడ్నీలో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ రగ్బీ మ్యాచ్ లో విస్మయకర ఘటన చోటుచేసుకుంది. అర్జెంటీనా జాతీయగీతం ప్లే చేయాల్సిన సమయంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధికెక్కిన యూ2 బ్యాండ్ కు చెందిన ఓ రాక్ సాంగ్ ను ప్లే చేశారు.
స్టేడియంలో ఆడియో నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన డీజే తప్పిదం కారణంగా అర్జెంటీనా ఆటగాళ్లు అయోమయానికి గురయ్యారు. తమ జాతీయగీతం వస్తుందని నిటారుగా నిల్చున్న ఆటగాళ్లు ఉర్రూతలూగించే రాక్ సాంగ్ రావడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, మ్యాచ్ నిర్వాహకులు మాత్రం ఈ ఘటనను కప్పి పుచ్చేందుకు విఫలయత్నం చేశారు. 'ప్రేక్షకులారా మేం మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నాం, అంతే!' అంటూ ఓ అసందర్భ ప్రకటన చేశారు. కానీ, వీక్షకులు వెంటనే ట్విట్టర్ లో ఏకిపారేశారు. ఈ మ్యాచ్ లో అర్జెంటీనా జట్టు 74-0 తేడాతో రాండ్ విక్ ను చిత్తుగా ఓడించి తమ సత్తా ఏంటో చూపించింది.