Andhra Pradesh: పరిటాల ఫ్యామిలీ రైతులను దోచుకుంది.. కలెక్టర్, ఎస్పీ చర్యలు తీసుకోవాలి!: వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
- ప్రైవేటు మండీలో 10 శాతం పన్ను వసూలు
- దీన్ని పరిటాల బంధువులు, అనుచరులు నడిపారు
- పరిటాల సునీతపై రాప్తాడు ఎమ్మెల్యే ఆగ్రహం
తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పరిటాల సునీతపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేటు టమాటా మండీలో తిష్టవేసిన పరిటాల అనుచరులు రైతుల నుంచి 10 శాతం పన్ను వసూలు చేశారని ఆయన ఆరోపించారు. గత 100 రోజుల్లో తాము రాప్తాడులో అభివృద్ధికి బాటలు వేశామని చెప్పారు. గంగలకుంట చెరువుకు నీళ్లు ఇచ్చేందుకు ఇప్పటికే సర్వే పూర్తయిందన్నారు. పరిటాల సునీత మూసివేయించిన ఎఫ్‌సీఐ గోదామును తెరిపిస్తామనీ, ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే ఎఫ్ సీఐ సీఎండీని కలిశామని వెల్లడించారు. అనంతపురంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వైసీపీ నేతలతో కలిసి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్న పరిటాల సునీత గంగలకుంట చెరువుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ‘ధనదాహంతో జంగాలపల్లి ఎఫ్‌సీఐ గోదామును మీరు మూయించింది నిజం కాదా? అక్కడ పని చేస్తున్న కార్మికుల పొట్ట కొట్టింది మీరు కాదా? కక్కలపల్లి సమీపంలో ప్రైవేటు టమాటా మండీలో తిష్టవేసిన మీ బంధువులు, అనచరులు రైతుల నుంచి పదిశాతం పన్ను వసూలుచేస్తూ దోచుకున్నది నిజం కాదంటారా? 2016 నుంచి నీళ్లు ఉన్నప్పటికీ మీ సొంత మండలంలోని పేరూరు డ్యాంకు ఎందుకు ఇవ్వలేకపోయారు?’ అని ఎమ్మెల్యే నిలదీశారు.
మండీని నడుపుతున్న మంత్రి పరిటాల అనుచరులు, బంధువులు రైతుల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తుంటే ప్రభుత్వం కళ్లు మూసుకుందని విమర్శించారు. అయితే ఈ మండీని నడపటానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సుమోటోగా కేసు నమోదుచేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని కోరారు. పరిటాల సునీత సొంత మండలం పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇవ్వొచ్చని తాము చెబితే నవ్వారనీ, ఇప్పుడు త్వరలోనే ఇందుకోసం జీవో కూడా విడుదల కాబోతోందని చెప్పారు.
పరిటాల సునీత ఐదేళ్లు ఎమ్మెల్యేగా, మరో ఐదేళ్లు మంత్రిగా పని చేసినా పరిష్కరించలేని సమస్యను తాము 60 రోజుల్లోనే పరిష్కరించామని ప్రకాష్ రెడ్డి తెలిపారు. అలాగే నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ప్రక్రియ మొదలైందన్నారు. రాబోయే రెండేళ్లలో రాప్తాడు రూపురేఖలు మార్చేస్తామని ప్రకటించారు.