zomato: 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.. ‘జొమాటో’ సంచలన ప్రకటన!
- ఇటీవల 540 మందిని తప్పించిన సంస్థ
- కస్టమర్ సర్వీస్ తగ్గడం వల్లేనని వివరణ
- త్వరలోనే లాభాలబాట పడతామని ధీమా
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కీలక ప్రకటన చేసింది. త్వరలోనే తాము లాభాలబాట పట్టనున్నామని తెలిపింది. ఇందుకు అనుగుణంగా టెక్నాలజీ, ప్రొడక్ట్, డేటా సైన్సెస్ టీమ్స్ కోసం భారీగా ఉద్యోగులను చేర్చుకోనున్నట్లు వెల్లడించింది. ఈ నెలలోనే దాదాపు 10,000 మందిని విధుల్లోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది. కస్టమర్ సర్వీస్ అవసరం తగ్గడం వల్లే గురుగ్రామ్ లోని ఆఫీసులో 540 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ వివరణ ఇచ్చారు.
ఇలా ఉద్యోగాలు కోల్పోయినవారికి రెండు నెలల జీతం, వచ్చే ఏడాది జనవరి వరకూ పలు ప్రయోజనాలను అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వీరి కోసం జాబ్ ఫెయిర్ కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ తాము 1,200 మందిని విధుల్లోకి తీసుకున్నామని గోయల్ తెలిపారు.
కొత్త నగరాలకు వేగంగా విస్తరించడం, ఔట్‌లెట్లు 'డార్క్ కిచెన్'లను విస్తరించడం కారణంగా వేలాది ఉద్యోగాలను సృష్టించి లాభాలబాట పట్టామని పేర్కొన్నారు. గత మూడు నెలల్లో నష్టాలు 50 శాతం తగ్గాయన్నారు. ప్రస్తుతం తమ సంస్థ 24 దేశాల్లో 10,000 నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తోందని గోయల్ చెప్పారు. మనదేశంలోని 500 నగరాల్లో 2.5 కోట్ల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తోందన్నారు.