KCR: యాదాద్రి రాతి స్తంభం... కేసీఆర్ చిత్రం స్థానంలో సుదర్శన చక్రం!
- కేసీఆర్ చిత్రాలపై వెల్లువెత్తిన విమర్శలు
- అన్ని రాజకీయ చిహ్నాలను తొలగించాలని నిర్ణయం
- పద్మాలు, హంసలను చెక్కనున్న శిల్పులు
యాదగిరి గుట్ట అష్టభుజి ప్రాకార మండపంలో ఏర్పాటు చేసిన రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రాలను చెక్కడంపై తీవ్ర విమర్శలు రాగా, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వివాదాస్పద చిత్రాలనన్నింటినీ అధికారులు తొలగించారు. కేసీఆర్ చిత్రం ఉన్న రాతిస్తంభంపై సుదర్శన చక్రం, టీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన కారు గుర్తు స్థానంలో హంసను చెక్కనున్నారు.
కేసీఆర్ కిట్, హరితహారం, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ తదితర బొమ్మల స్థానంలో పద్మాలు, లతలు, హంసలను చెక్కనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఓ శిల్పి తన సొంత నిర్ణయంతో రాజకీయ అంశాలకు చెందిన బొమ్మలు చెక్కాడేతప్ప, ఇందులో ఎవరి ప్రమేయమూ లేదని వైటీడీఏ అధికారులు అంటున్నారు.