Ram Jethmalani: కేసు టేకప్ చేస్తే కోట్లు రాలాల్సిందే... సీనియర్ లాయర్ రామ్ జెఠ్మలాని గురించి ఆసక్తికర విషయాలు!
- తిరుగులేని లాయర్ గా గుర్తింపు పొందిన జెఠ్మలాని
- హై ప్రొఫైల్ కేసుల డీలింగ్ తో ఖరీదైన లాయర్ గా గుర్తింపు
- స్మగ్లర్లు, మాఫియా డాన్ల కేసులను సైతం వాదించిన జెఠ్మలాని
సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలాని(95) ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జెఠ్మలాని ఈరోజు ఉదయం 7.45 గంటలకు తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 14న తన పుట్టినరోజును జెఠ్మలాని జరుపుకోవాల్సి ఉంది. అంతలోనే ఆయన చనిపోవడంతో జెఠ్మలాని కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కాగా, జెఠ్మలాని అంత్యక్రియలను లోధీ రోడ్డులోని శ్మశానంలో ఈరోజు సాయంత్రం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జెఠ్మలానికి సంబంధించిన టాప్-10 ఆసక్తికరమైన అంశాలు మీకోసం..
1. ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్సులో ఉన్న శిఖాపూర్ లో 1923, సెప్టెంబర్ 14న జెఠ్మలాని జన్మించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 ఏళ్లకే ‘లా’లో డిగ్రీని అందుకున్నారు. దేశవిభజన జరిగేవరకూ కరాచీలో లాయర్ గా ప్రాక్టీస్ చేశారు.
2. విభజన అనంతరం భారత్ కు వచ్చేసిన జెఠ్మలాని దాదాపు 6 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. వాజ్ పేయి కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన జెఠ్మలాని, ఆ తర్వాత అభిప్రాయభేదాలు రావడంతో తన పదవికి 2000లో రాజీనామా చేశారు.
3. 2004 లోక్ సభ ఎన్నికల్లో లక్నో నుంచి జెఠ్మలాని అప్పటి ప్రధాని వాజ్ పేయిపైనే పోటీచేశారు.
4. ఆయన 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
5. 1959లో నానావతి కేసు(భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న వ్యక్తిని నేవీ అధికారి నానావతి కాల్చిచంపిన కేసు. దీని ఆధారంగా అక్షయ్ కుమార్ ‘రుస్తుం’ సినిమా కూడా తీశాడు)తో జాతీయ స్థాయిలో జెఠ్మలానికి గుర్తింపు లభించింది.
6. రామ్ జెఠ్మలాని తన కెరీర్ లో ఇందిరాగాంధీ హత్య కేసు, హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం, ఎల్ కే అద్వాణీ హవాలా కేసు, జయలలిత, కనిమొళి, లలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన హైప్రొఫైల్ కేసులను వాదించారు.
7. శరీరం సహకరించకపోవడంతో 2017, సెప్టెంబర్ లో ఆయన న్యాయవాద వృత్తి నుంచి తప్పుకున్నారు.
8.1960ల్లో జెఠ్మలానీ స్మగ్లర్ల తరఫున కూడా వాదించారు. అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ తరఫున జెఠ్మలాని వాదించడంతో ఆయనకు స్మగ్లర్ల లాయర్ గా పేరుపడిపోయింది.
9. కేంద్ర మాజీ మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో జెఠ్మలాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరఫున వాదించారు. ఇందుకోసం కేజ్రీవాల్ నుంచి ఏకంగా రూ.1.5 కోట్లను వసూలు చేశారు. కేసు వాదించేందుకు తన సహాయకులతో కలిసి వాలిపోయే జెఠ్మలాని వారి ఖర్చులను కూడా క్లయింట్ నుంచే వసూలు చేస్తారు.
10. జెఠ్మలానికి కుమారుడు మహేశ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఓ కుమార్తె ముందుగానే చనిపోయారు.