Ram Jethmalani: రామ్ జెఠ్మలానిపై ప్రశంసలు కురిపించిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా!

  • జెఠ్మలాని గొప్ప న్యాయకోవిదుడన్న కోవింద్
  • ఆయనకు భయమే లేదని ప్రధాని మోదీ కితాబు
  • అవసరమున్న ప్రతీ వ్యక్తిని ఆదుకున్నారన్న షా

ప్రముఖ న్యాయకోవిదుడు, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలాని మరణంపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై రామ్ నాథ్ కోవింద్ స్పందిస్తూ..‘జెఠ్మలాని మరణ వార్త నన్ను తీవ్ర విషాదంలో ముంచివేసింది. ప్రజా సమస్యల విషయంలో తన ఆలోచనలను ఆయన అద్భుతమైన వాగ్ధాటితో, ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పేవారు. ఈరోజున మన దేశం గొప్ప న్యాయకోవిదుడిని, గొప్ప విజ్ఞానవంతుడిని కోల్పోయింది’ అని తెలిపారు.

రామ్ జెఠ్మలానిని పలుమార్లు కలుసుకుని మాట్లాడే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపిన ప్రధాని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జెఠ్మలాని మన మధ్య లేకపోయినా ఆయన సాధించిన గొప్ప పనులు మన మధ్య నిలిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆయన తాను అనుకున్నది ఎలాంటి జంకు, భయం లేకుండా నిర్భయంగా మాట్లాడేవారని మోదీ కితాబిచ్చారు.

ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజా హక్కుల కోసం జెఠ్మలాని పోరాడారని గుర్తుచేశారు. అవసరార్థం తనను ఆశ్రయించే వ్యక్తులకు తప్పకుండా సాయం చేసే తత్వం జెఠ్మలానీదని కితాబిచ్చారు. జెఠ్మలాని ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు రామ్ జెఠ్మలానికి నివాళులు అర్పించిన హోంమంత్రి అమిత్ షా.. ఆయన గొప్ప మానవతావాది అని ప్రశంసించారు.

Ram Jethmalani
DEATH
New Delhi
Narendra Modi
Ram Nath Kovind
AMIT SHAH
  • Loading...

More Telugu News