Andhra Pradesh: ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పేరు ఖరారు!
- ఆమోదం తెలిపిన ఏపీ హైకోర్టు సీజే
- త్వరలోనే అధికారిక ఉత్తర్వులు
- డిప్యూటీ సీఎంను కూడా విచారించే అధికారం
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి పేరు ఖరారైంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల లోకాయుక్త చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించాలని నిబంధనలను సవరించారు. అందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. కాగా, లక్ష్మణ్ రెడ్డి పేరుకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ ఆమోదముద్ర వేశారు.
ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, విచారించే అధికారం లోకాయుక్తకు ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ విప్, ప్రజా వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నియమించే ఏ అధికారిపై అయినా లోకాయుక్త విచారణ జరపవచ్చు. అయితే జడ్జీలు, జ్యుడీషియల్ సర్వీసు సభ్యులు మాత్రం దీని పరిధిలోకి రారు.
అలాగే రాష్ట్రంలోని ఏదైనా కోర్టు అధికారి, ఉద్యోగి కూడా లోకాయుక్త పరిధిలోకి రారు. వీరితో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఏపీఏటీ చైర్మన్, ఇతర సభ్యులు, ఏపీ అకౌంటెంట్ జనరల్, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఎన్నికల అధికారులను లోకాయుక్త విచారించలేదు. కాగా, లోకాయుక్తగా లక్ష్మణ్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీచేయనుంది.