Nara Lokesh: తుగ్లక్ 2.0 సమస్యకి పరిష్కారం ఇదే... కానీ శిక్ష మాత్రం తప్పదు మాస్టారూ!: నారా లోకేశ్
- సీఎం జగన్ పై నారా లోకేశ్ విమర్శలు
- జగన్ వ్యక్తిగత హాజరు నుంచి కోర్టును మినహాయింపు కోరడంపై వ్యాఖ్యలు
- దోచుకున్న లక్ష కోట్లు ఇచ్చేస్తే సరిపోతుంది అంటూ వ్యంగ్యం
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినందున, ప్రతి శుక్రవారం తాను కోర్టుకు హాజరుకాలేనంటూ జగన్ సీబీఐ కోర్టుకు విన్నవించుకోవడంపై లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. తుగ్లక్ 2.0 సమస్యకు పరిష్కారం ఇదేనంటూ వరుస ట్వీట్లు చేశారు.
"వైఎస్ జగన్ గారూ, హైదరాబాద్ రావడం ఖర్చుతో కూడుకున్న పని అని, రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని కోర్టుకు కథలు చెప్పడం ఎందుకు? దోచుకున్న లక్ష కోట్లు రాష్ట్ర ఖజానాకు ఇచ్చేయండి చాలు, రాష్ట్ర ఆర్థిక స్థితీ మెరుగవుతుంది, అటు ఖజానా కూడా నిండుతుంది. అంతేకాకుండా, మీరు ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు, మీ భద్రత వ్యయానికి అయ్యే నిధులు సమకూర్చడం కూడా ప్రభుత్వానికి తేలికవుతుంది. ఇంత సులభ పరిష్కారం ముందుంచుకుని, కోర్టును హాజరు మినహాయింపు కోరడం ఎందుకు మాస్టారూ! శిక్ష ఎలాగూ తప్పదు కదా!" అంటూ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.