Andhra Pradesh: చంద్రబాబూ.. ప్రజలపై అంత ప్రేముంటే ముందుగా కోడెల, యరపతినేని బాధితులను ఆదుకో!: అంబటి రాంబాబు

  • మా పాలనలో దాడులు జరగలేదు
  • చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా చేస్తున్నారు
  • గుంటూరులో మీడియాతో సత్తెనపల్లి ఎమ్మెల్యే

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏపీలో ఎలాంటి దాడులు జరగడం లేదనీ, అసలు బాధితులు అంటూ ఎవరూ లేరని సత్తెనపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నేత అంబటి రాంబాంబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు కృత్రిమ బాధితులను సృష్టించి శిబిరాలు ఏర్పాటు చేసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. గతంలో పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా చేశారు, ఇప్పుడు కూడా డ్రామా చేస్తున్నారని చెప్పారు. పల్నాడులో కోడెల శివప్రసాద్, యరపతినేని సహా టీడీపీ నేతలపై అనేక ఆరోపణలు ఉన్నాయనీ, వీరి బాధితులు చాలామంది ఉన్నారని ఆరోపించారు. నిజంగా చంద్రబాబుకు ప్రజలపై ప్రేమ ఉంటే తన పార్టీ నేతల బాధితులను ఆదుకోవాలని సూచించారు. గుంటూరులో ఈరోజు మీడియాతో అంబటి మాట్లాడారు.

కోడెల శివప్రసాద్ పై సొంత టీడీపీ నేతలే నరసరావుపేట, సత్తెనపల్లిలో కేసులు నమోదు చేశారని అంబటి గుర్తుచేశారు. చంద్రబాబు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ బాధితులను కలుసుకోనున్నారని చెప్పారు. పల్నాడు ప్రాంతం ఫ్యాక్షన్ గ్రామాలున్న ప్రాంతమేననీ, కాబట్టి నేతల పర్యటన సమయంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం మామూలు విషయమని వ్యాఖ్యానించారు.

టీడీపీపై కక్షసాధింపు కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. పల్నాడులో ఏదో గందరగోళం జరుగుతోందన్న ప్రచారం చేయడం ద్వారా పార్టీని మేనేజ్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈరోజు సాయంత్రం పిడుగురాళ్లతో పాటు పల్నాడులోని ఇతర ప్రాంతాల్లో టీడీపీ బాధితులను హోంమంత్రి సుచరిత కలుసుకుంటారని పునరుద్ఘాటించారు.

Andhra Pradesh
YSRCP
AMBATI RAMBABU
Guntur District
Telugudesam
Chandrababu
ATTACKS
VIOLANCE
  • Loading...

More Telugu News