Andhra Pradesh: ఏపీలో కక్షపూరిత రాజకీయాలు.. అందుకే నాపై తప్పుడు కేసు పెట్టారు!: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- జగన్ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత
- ఏపీని నాశనం చేస్తున్నారు
- ఇసుక ట్రాక్టర్ రూ.2,500కు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఇటీవల ఫోర్జరీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 58–3లోని 2.41ఎకరాల తమ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇతరులకు అమ్మారని బాధితులు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ కేసులో నిన్న సోమిరెడ్డికి వెంకటాచలం ఎస్సై షేక్ కరీముల్లా సమన్లు కూడా అందజేశారు. తాజాగా ఈ వ్యహారంపై టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే తనపై తప్పుడు కేసు బనాయించారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ తీరుపై సొంత వైసీపీలోనే వ్యతిరేకత వస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళుతూ, అప్పగిస్తే ఇప్పుడు నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో చేపట్టిన పలు సంక్షేమ పథకాలను అసలు ఎందుకు ఆపేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ట్రాక్టర్ ఇసుకను జగన్ సర్కారు రూ.2,500 చేసేసిందని ఆరోపించారు.