Andhra Pradesh: పల్నాడులో వాస్తవ పరిస్థితులు ఒకలా ఉంటే మీడియాలో మరోలా ప్రచారం చేస్తున్నారు!: దక్షిణ కోస్తా ఐజీ వినీత్ బ్రిజ్లాల్
- అన్నిపార్టీలు, వర్గాలు పోలీసులకు సహకరించాలి
- టీడీపీ శ్రేణులు చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదుచేశాం
- వీటిలో చాలా కేసులు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి
- గుంటూరులో ఐజీ బ్రిజ్లాల్, ఎస్పీ జయలక్ష్మి పర్యటన
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పల్నాడులో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు తమను గ్రామాల్లో బతకనివ్వడం లేదని టీడీపీ శ్రేణులు ఓవైపు ఆరోపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనీ, వాళ్లే వైసీపీ మద్దతుదారులపై దాడులకు దిగుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ బాధితుల శిబిరాలను ఏర్పాటు చేయడం, పోటీగా టీడీపీ బాధితుల శిబిరాలను తామూ ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు ప్రకటించడంతో పరిస్థితి వేడెక్కుతోంది. ఈ క్రమంలో దక్షిణ కోస్తా ఐజీ వినీత్ బ్రిజ్లాల్, గుంటూరు ఎస్పీ జయలక్ష్మి ఈరోజు పల్నాడులో పర్యటించారు.
పల్నాడులో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఈ సందర్భంగా కితాబిచ్చారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయం నుంచి ఫ్యాక్షనిజాన్ని అణచివేసి శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసులు బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అయితే ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా ప్రచారం సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని పార్టీలు, అన్ని వర్గాలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవ చేయడానికే పోలీసులు ఉన్నారనీ, కాబట్టి అనవసరమైన వదంతులను వ్యాప్తి చేయొద్దని అన్నివర్గాలను కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చెప్పారు.
తాము చట్టం ప్రకారం ముందుకు పోతామనీ, మనుషులను, పార్టీలను పరిగణనలోకి తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. 2014 తర్వాత ఈ ప్రాంతంలో 4 హత్యలు జరిగాయని, మరో 324 గొడవలు జరిగాయని తెలిపారు. వీటిలో 90 శాతం కేసులలో విచారణ పూర్తయి, చార్జిషీట్ కూడా దాఖలు చేశామని వెల్లడించారు. కాబట్టి గతంలో ఎన్నికల ముందుతో పోల్చుకుంటే ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. గ్రామాల నుంచి వెళ్లిపోవాలని టీడీపీ మద్దతుదారులకు పోలీసులే చెబుతున్నారన్న వార్తలను ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఖండించారు. ఇలాంటి ఘటనలు జరిగినట్లు తేలితే తమ దృష్టికి తీసుకురావాలనీ, ఒకవేళ అది నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఒకలా ఉంటే మీడియాలో ప్రచారం మరోలా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి, ఆత్మకూరులో టీడీపీ-వైసీపీ ఘర్షణల సందర్భంగా నిందితులకు తాము కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్కరించామనీ, బాధితులకు ధైర్యం చెప్పామని జిల్లా ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. టీడీపీ నేతలు కంప్లైట్ ఇచ్చినప్పుడు తాము కేసు రిజిస్టర్ చేశామనీ, నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ కేసుల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేశామనీ, చాలా కేసులు ఫైనల్ స్టేజీలో ఉన్నాయని పేర్కొన్నారు. టీడీపీ మద్దతుదారులను ఊరు విడిచిపెట్టి వెళ్లాలని పోలీసులు చెప్పినట్లు ఆధారాలు సమర్పిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.