Suryapet District: బిడ్డ పుట్టాక మోజు తీరిందని ముఖం చాటేశాడు...భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య

  • ఇంటికి రాగానే తాళం వేసి వెళ్లిపోయిన అత్తింటి వారు
  • మరోసారి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన భర్త
  • బాధితురాలికి బాసటగా నిలిచిన గ్రామస్థులు

నువ్వంటే ఇష్టం అన్నాడు...ప్రాణం అంటూ బాసలు చేశాడు. సంప్రదాయం ప్రకారం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓ బిడ్డ పుట్టాక ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. తనకు అన్యాయం చేయొద్దంటూ అత్తింటికి చేరుకున్న బాధితురాలికి తిరస్కారమే ఎదురయ్యింది. ఆమెను చూసి కుటుంబ సభ్యులంతా తాళం వేసి వెళ్లిపోయారు. మళ్లీ తన ఇంటికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్త బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు.

బాధితురాలి గోడు తెలిసిన గ్రామస్థులు ఆమెకు బాసటగా నిలవడంతో భర్త ఇంటి ముందే ఆమె మౌన పోరాటం చేస్తోంది. వివరాల్లోకి వెళితే...సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌ గ్రామానికి చెందిన ఎం.డి.ఆస్లాం నల్గొండకు చెందిన ఆర్షియా తబుస్సుంను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు సజావుగా కాపురం చేశాడు. వీరికి ఓ కూతురు పుట్టింది. బిడ్డ పుట్టాక కొన్ని రోజుల నుంచి ఆస్లాం ముఖం చాటేయడం మొదలు పెట్టాడు.

దీంతో బిడ్డను తీసుకుని బాధితురాలు గత నెల 19న అత్తింటికి వెళ్లింది. ఆమెను చూడగానే అత్తింటి వారు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పైగా ఇక్కడే ఉంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్త బెదిరించడం మొదలుపెట్టాడు. అయినా బాధితురాలు పట్టువీడకుండా ఇంటి ఎదుట రేకుల షెడ్డులో ఉంటూ అప్పటి నుంచి తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఆమె పోరాటాన్ని చూసి జాలిపడిన స్థానికులు నిన్న పోలీసులను ఆశ్రయించారు.

అత్తింటి వారితో మాట్లాడి ఆమెకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారు స్పందిస్తూ దంపతుల వివాదం పాతదేనని, గతంలో ఒకసారి ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చామని, అయినా ఆమె భర్త ఆస్లాం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు భర్తపై కేసు కంటే తన కాపురం చక్కదిద్దాలని కోరుతుండడంతో పోలీసులకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు.

  • Loading...

More Telugu News