krishna river boat travel: కృష్ణా నదిలో శ్రీశైలానికి లాంచీ ప్రయాణం నేటి నుంచి మళ్లీ మొదలు
- తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభం
- ఉదయం 10.30 గంటలకు సాగర్ హిల్ కాలనీ నుంచి తొలి ప్రయాణం
- మరునాడు సాయంత్రం 4 గంటలకు తిరిగి చేరిక
శ్రీశైలం మల్లికార్జున స్వామిని రోడ్డు మార్గంలో కాకుండా కృష్ణమ్మపై లాంచీ ప్రయాణంలో చేరుకుని దర్శించుకోవాని ఉవ్విళ్లూరే వారికి మళ్లీ ఆ అవకాశం వచ్చింది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు నాగార్జునసాగర్ హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలానికి తొలి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను తెలంగాణ పర్యాటక శాఖ చేసింది.
సాగర్ నుంచి లాంచీలో ప్రయాణిస్తూ శ్రీశైలానికి వెళ్లదలచిన వారు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుంటే ఈ రెండు రోజుల లాంచీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. పర్యాటకులను ఉదయం 7.30 గంటలకు పికప్ చేసుకుని బస్సులో హైదరాబాద్ నుంచి 10 గంటలకు సాగర్‌కు చేరుస్తారు. అక్కడ 10.30 గంటలకు లాంచీ ప్రయాణం మొదలవుతుంది.
కృష్ణానది పరీవాహకంలోని అందాలను వీక్షిస్తూ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు. అక్కడ దైవ దర్శనం, సందర్శనీయ స్థలాలను చూసిన తర్వాత మరునాడు ఉదయం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు సాగర్‌కు చేరుకుని బస్సులో రాత్రి 7.30 గంటకు తిరిగి హైదరాబాద్‌కు చేరుస్తారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లి వచ్చేవారికి పెద్దలకు రూ.2,999, పిల్లలకు రూ.2,399 వసూలు చేస్తారు. సాగర్ నుంచి శ్రీశైలానికి వెళ్లి వచ్చే వారికి పెద్దలైతే 2,200, పిల్లలకు 1760, సాగర్ నుంచి శ్రీశైలానికి ఓ వైపు ప్రయాణానికి పెద్దలకు రూ.వెయ్యి, పిల్లలకు రూ.800 చార్జి చేయనున్నారు.