traffic rules: ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి హైదరాబాద్ పోలీస్ పరువు తీయొద్దు.. ట్రాఫిక్ పోలీసులకు అంతర్గత ఆదేశాలు జారీ
- ఉత్తర్వులు జారీ చేసిన అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్
- హెల్మెట్ ధరించకుంటే రూ.2 వేల జరిమానా
- కొత్త చట్టం ప్రకారం రెండింతల జరిమానా తప్పదని హెచ్చరిక
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే పోలీసులకూ భారీ జరిమానా తప్పదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) ఎస్.అనిల్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు శాఖలో అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు ఎవరైనా సరే విధుల్లో ఉండి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండింతల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కారులో వెళ్తూ సీటు బెల్టు పెట్టుకోకపోయినా, రాంగ్ రూట్‌లో ప్రయాణించినా, సిగ్నల్ జంప్ చేసినా వాహన సవరణ చట్టం-2019లోని సెక్షన్ 210-బి ప్రకారం రెండింతల జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే రూ.2 వేల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి హైదరాబాద్ పోలీస్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ప్రవర్తించవద్దని అనిల్ కుమార్ సూచించారు.