Sri Lanka: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. టీ20ల్లో శ్రీలంక బౌలర్ మలింగ ప్రపంచ రికార్డు
- ఈ ఫీట్ సాధించడం మలింగకు ఇది రెండోసారి
- అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కీర్తి
- టీ20ల్లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడో టీ20లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీయడం మలింగ కెరియర్‌లో ఇది రెండోసారి. మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గానూ, టీ20 క్రికెట్‌లో వంద వికెట్లు పడగొట్టిన మొదటి బౌలర్‌గానూ పలు రికార్డులను తన పేరున రాసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అనంతరం 126 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్.. మలింగ బంతులకు విలవిల్లాడింది. మూడో ఓవర్ మూడో బంతికి మన్రోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న మలింగ ఆ తర్వాత వరుసగా రూథర్‌ఫోర్డ్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఎనిమిది మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో 16 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. అయితే, సిరీస్ మాత్రం 2-1తో కివీస్ సొంతం చేసుకుంది.