Deuchars: ఒక్క బీరుకు బిల్లు చూసి కిక్కు దిగిపోయింది!
- ఇంగ్లాండ్ లో ఘటన
- కార్డు స్వైప్ చేసే సమయంలో బిల్లింగ్ లో పొరబాటు
- రూ.73 లక్షల సొమ్ము హోటల్ యాజమాన్యం ఖాతాలోకి తరలింపు
ఓ ఆస్ట్రేలియా క్రికెట్ కాలమిస్టుకు ఇంగ్లాండ్ లో విచిత్రమైన అనుభవం ఎదురైంది. పీటర్ లాలర్ అనే క్రీడా పాత్రికేయుడు అనేక మ్యాగజైన్లకు క్రికెట్ పై వ్యాసాలు రాస్తుంటాడు. అయితే సరదాగా బీరు తాగుదామని మాంచెస్టర్ లోని ఓ హోటల్ కు వెళ్లాడు. తనకు అమెరికన్ బ్రాండ్లు వద్దని చెప్పడంతో, హోటల్ వారు స్కాట్లాండ్ కు చెందిన కెలడోనియన్ బ్రూవరీ సంస్థ తయారు చేసే ఫేమస్ బీరు 'డకార్స్' ను సప్లై చేశారు. ఇంగ్లీష్ వాతావరణాన్ని హాయిగా ఆస్వాదిస్తూ ఆ క్రీడా పాత్రికేయుడు బీరు సేవనం పూర్తి చేశాడు.
వెయిటర్ తీసుకువచ్చిన బిల్లును తీసుకుని క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి తన క్రెడిట్ కార్డు ఇచ్చాడు. అక్కడ ఉన్న ఉద్యోగిని ఆ కార్డు అందుకుని స్వైప్ చేసి తిరిగివ్వబోతుండగా "బిల్లు ఎంతయింది?" అని పీటర్ లాలర్ ఆమెను అడిగాడు. డిస్ ప్లే వైపు చూసిన ఆ ఉద్యోగిని హడలిపోయింది. తాను పొరబాటుగా టైప్ చేయడంతో బిల్లు రూ.73 లక్షలుగా వచ్చింది. అంటే పీటర్ లాలర్ ఖాతా నుంచి ఆ సొమ్మంతా హోటల్ యాజమాన్యం ఖాతాలోకి వెళ్లిపోయింది.
దాంతో మేనేజర్ స్వయంగా వచ్చి లాలర్ ను క్షమాపణలు అడగడంతోపాటు, ఆ సొమ్మును తప్పకుండా తిరిగిస్తామని హామీ ఇచ్చాడు. కార్డు స్వైపింగ్ చేసే క్రమంలో పొరబాటు జరిగివుంటుందని వివరణ ఇచ్చాడు. ఏదైతేనేం, లోకల్ బీరు టేస్ట్ చేద్దామని వచ్చిన ఆ క్రీడా పాత్రికేయుడికి కిక్కు దిగిపోయింది!