Andhra Pradesh: వందరోజుల వైసీపీ పాలనపై ఏ ఒక్క అవినీతి ఆరోపణా రాలేదు: మంత్రి అవంతి
- సీఎం జగన్ వంద రోజుల పాలనపై విమర్శలకు ఖండన
- పోలవరం, అమరావతి నిర్మాణాలపై దుష్ప్రచారం తగదు
- గంటా గురించి భీమిలిలో అడిగితే తెలుస్తుంది
ఏపీలో సీఎం జగన్ వంద రోజుల పాలనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలకు మంత్రి అవంతి శ్రీనివాస్ దీటుగా జవాబిచ్చారు. వంద రోజుల పాలనపై ఒక్క అవినీతి ఆరోపణా రాలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు, రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపేశామని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై ఆయన ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. గంటా, ఆయన అనుచరులు ఎన్ని భూములు కబ్జా చేశారో భీమిలి వెళ్లి అడిగితే తెలుస్తుందని, దీనిపై దర్యాప్తునకు సిట్ వేస్తారని తెలిసే సీఎంకు గంటా లేఖ రాశారని ఎద్దేవా చేశారు. సిట్ నివేదికలో నిందితులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.