Chandrababu: రక్తం చిమ్మి, ఎముకలు చల్లి యజ్ఞాలను భగ్నం చేయడం పురాణాల్లో విన్నాం, వాటిని మించిన రాక్షసత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాం: చంద్రబాబు

  • దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా నివసించే హక్కు ఉందన్న చంద్రబాబు
  • నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా? అంటూ మండిపాటు
  • రైతుల కష్టం తెలిసినవాళ్లు చేసే పనులేనా ఇవి? అంటూ వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఘాటుగా స్పందించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వంపై నిప్పలు చెరిగారు. దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా నివసించే హక్కు ఉందని, కానీ వైసీపీ వాళ్ల బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవాలా అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. నచ్చిన పార్టీకి ఓటేసినంత మాత్రాన చంపేస్తారా? పంటపొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా? రోడ్లకు అడ్డంగా గోడలు కడతారా? పాడిగేదెలకు విషం పెట్టి చంపుతారా, ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ మండిపడ్డారు.

బోర్లు పూడ్చివేయడం, నీటి పైపులు కోసేయడం ఇవన్నీ రైతుల కష్టం తెలిసినవాళ్లు చేసే పనులేనా? అంటూ నిలదీశారు. వైసీపీ నేతల దుర్మార్గాలతో 70 ఏళ్ల రాజ్యాంగం, 73 ఏళ్ల స్వాతంత్ర్యం నవ్వులపాలయ్యాయని ట్వీట్ చేశారు. "యజ్ఞం చేస్తుంటే దాన్ని భగ్నం చేయడానికి రక్తం చిమ్మడం, ఎముకలు చల్లడం పురాణాల్లోనే విన్నాం. ఇప్పుడు అంతకుమించిన రాక్షస కృత్యాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మానవతావాదులందరూ ఇలాంటి చర్యలను ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News