Uttar Pradesh: ఇంటి పునాదుల్లో రూ.25 లక్షల నిధి... చట్టం పేరు చెప్పి మోకాలడ్డిన ప్రభుత్వం!
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- పునాది గుంతల్లో బయటపడ్డ బంగారు, వెండి ఆభరణాలు
- 100 ఏళ్ల నాటి నిధి అంటున్న అధికారులు
భవన నిర్మాణాలు జరిగే సమయంలో పునాదులు తవ్వడం సాధారణం. అయితే, ఆ పునాదుల్లో ఒక్కోసారి పాతకాలపు వస్తువులు, నిధినిక్షేపాలు బయటపడుతుంటాయి. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలో కూడా ఓ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా నిధి బయటపడింది. కానీ ప్రభుత్వ నిబంధనల కారణంగా ఆ నిధి ఇంటి యజమానికి దక్కలేదు.
పునాదుల కోసం తవ్వకం జరిపిస్తుండగా, ఓ పెట్టె లభ్యమైంది. ఆ పెట్టె తెరిచి చూడగా అన్నీ బంగారు, వెండి ఆభరణాలే కళ్లు జిగేల్మనిపించే రీతిలో దర్శనమిచ్చాయి. ఇంటి యజమాని పట్టలేని సంతోషంతో ఎగిరి గంతేశాడు. ఆ పెట్టెలో ఉన్న బంగారం, వెండి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఈ విషయం ఎంత రహస్యంగా ఉంచాలన్నా వీలు కాలేదు. ఆ నోటా ఈ నోటా పడి పోలీసుల వరకు వెళ్లింది.
ఆ ఇంటి యజమానిని నిధి గురించి ప్రశ్నించగా, అబ్బే, నిధి లేదు ఏమీ లేదు అంటూ తప్పించుకోజూశాడు. కానీ పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో పెట్టెను తెచ్చి వారి ముందుంచాడు. చట్టపరంగా ఆ నిధి ప్రభుత్వానికే చెందుతుందన్న నేపథ్యంలో అధికారులు ఆ పాతిక లక్షల నిధిని స్వాధీనం చేసుకున్నారు. ఆ నిధి సుమారు 100 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు.