Hyderabad: ప్రజలు, ప్రభుత్వం కలిసి పని చేస్తేనే సమస్యల నుంచి బయటపడతాం: మంత్రి ఈటల

  • గాంధీ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఈటల
  • విషజ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం
  •  వైద్యులు సెలవులు లేకుండా పని చేస్తున్నారు

ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు, ప్రభుత్వం కలిసి పని చేస్తేనే సమస్యల నుంచి బయటపడతామని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని ఈరోజు ఆయన సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా నూతన సెమినార్ హాల్, లైబ్రరీని ఆయన ప్రారంభించారు. అనంతరం, మీడియాతో ఈటల మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం లేకుండా భారీ సమస్యలను ప్రభుత్వమొక్కటే నివారించలేదని అన్నారు. నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలిన విషజ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

గతంలో డెంగీ వ్యాధి వస్తే చనిపోయేవారని, ఇప్పుడు దాని తీవ్రత తగ్గిందని, రోగుల సంఖ్య పెరిగినా త్వరగానే వ్యాధి నయమవుతోందని అన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో 51 వేల మందికి పరీక్షలు చేస్తే 62 మందికే డెంగీ వ్యాధి ఉన్నట్టు తేలిందని, గాంధీ ఆసుపత్రిలో 419 మందికి నయం చేసి పంపారని వివరించారు. ప్రభుత్వ, బోధనా ఆసుపత్రుల్లో వైద్యులు సెలవులు లేకుండా పని చేస్తున్నారని, రోగులకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు.

రోజూ ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నివేదికను డీఎంహెచ్ వో కు పంపాలని ఆదేశించినట్టు చెప్పారు. మూసీ నది పరిసరాల్లో నీరు నిలవడం కారణంగా నగరంలో వ్యాధులు ప్రబలుతున్నాయని, ప్రజల్లో జ్వరాల పట్ల భయం పెంచేలా ప్రచారం చేయొద్దని, దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

Hyderabad
Gandhi Hospital
Minister
Eetala
  • Loading...

More Telugu News