Britain: మా పట్టణాన్ని విడిచి వెళ్లిపో.. బ్రిటన్ ప్రధానికి సామాన్య పౌరుడి వార్నింగ్!
- బ్రెగ్జిట్ గొడవపై చీలిపోయిన బ్రిటిషర్లు
- ప్రధాని బోరిస్ కు కొందరు ప్రజల మద్దతు
- మండిపడుతున్న మరికొందరు బ్రిటిషర్లు
బ్రిటన్ లో ప్రస్తుతం బ్రెగ్జిట్ వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ పై అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రెండుగా విడిపోయారు. దాదాపు 21 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ప్రతిపక్ష లేబర్ పార్టీకి మద్దతు పలికారు. బ్రెగ్జిట్ డీల్ లేకుండా బ్రిటన్ ఈయూ నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేశారు. దీంతో ఈ 21 మందిని ప్రధాని బోరిస్ జాన్సన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజా మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నించిన బోరిస్ కు స్వదేశంలో చేదు అనుభవం ఎదురయింది.
బ్రిటన్ లోని లీడ్స్ పట్టణంలో బోరిస్ జాన్సన్ తాజాగా పర్యటించారు. ఈ సందర్భంగా ఓ పౌరుడు ఆయన దగ్గరకొచ్చి కరచాలనం చేశాడు. అనంతరం ‘దయచేసి నా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లిపోండి’ అని మర్యాదగా కోరారు. దీంతో విస్తుపోయిన జాన్సన్.. క్షణాల్లోనే తేరుకుని ‘తప్పకుండా.. వీలైనంత త్వరగా వెళ్లిపోతా’ అని నవ్వుతూనే జవాబిచ్చారు. మరో పౌరుడు అయితే బోరిస్ పై అంతెత్తున ఎగిరిపడ్డాడు. ‘మీరు తిరగాల్సింది ఇక్కడ కాదు. బ్రస్సెల్స్(ఈయూ రాజధాని)లో బ్రెగ్జిట్ పై చర్చలు జరపాల్సింది. మీరు లీడ్స్ లో తిరుగుతున్నారు. ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు’ అని దుయ్యబట్టాడు.
కాగా, మరికొంత మంది బ్రిటిషర్లు మాత్రం జాన్సన్ కు మద్దతు పలికారు. వచ్చే నెల 31లోగా ఒప్పందం కుదిరినా, కుదరకున్నా ఈయూ నుంచి బయటకు వచ్చేస్తామని జాన్సన్ చెబుతున్నారు. దీన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీతో పాటు కొందరు కన్జర్వేటివ్ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందం కుదరకుండా బయటకు వస్తే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు.