Pakistan: కశ్మీర్ లో హిందుత్వను రుద్దేందుకు యత్నిస్తున్నారు.. చివరి బుల్లెట్, చివరి సైనికుడి వరకు పోరాడుతాం: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్
- పాకిస్థాన్ కీలక అజెండా కశ్మీరే
- కశ్మీర్ ను ఒంటరిగా వదిలిపెట్టం
- ఎంత దూరం వెళ్లేందుకైనా మేము సిద్ధమే
భారత్ పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా మరోసారి అక్కసును వెళ్లగక్కారు. కశ్మీర్ లో భారత్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని... ప్రజలపై బలవంతంగా హిందుత్వాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హిందుత్వకు బాధితురాలిగా కశ్మీర్ తయారైందని చెప్పారు. పాకిస్థాన్ కీలక అజెండా కశ్మీరేనని మరోసారి స్పష్టం చేశారు.
భారత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమకు ఓ ఛాలెంజ్ వంటిదని చెప్పారు. కశ్మీర్ ను పాకిస్థాన్ ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టదని అన్నారు. చివర శ్వాస, చివరి బుల్లెట్, చివరి సైనికుడి వరకు తాము పోరాడుతామని చెప్పారు. ఎంత వరకు వెళ్లేందుకైనా పాక్ ఆర్మీ సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని... అయితే, తాము శాంతికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్థాన్ మీ వెంటే ఉందనే విషయాన్ని కశ్మీర్ ప్రజలకు మరోసారి చెబుతున్నామని తెలిపారు. కశ్మీర్ కోసం ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్ధమని చెప్పారు.