Crime News: హైదరాబాద్ నగల దుకాణంలో చోరీ.. వలపన్ని దొంగలను పట్టేసిన పోలీసులు!
- బీహార్ ముఠా సభ్యుల అరెస్టు
- ఈనెల 3న కుషాయిగూడలోని శ్రీవినాయక నగల దుకాణంలో దొంగతనం
- రైల్లో వెళ్తున్నారని గుర్తించి మాటు వేసిన రైల్వే పోలీసులు
హైదరాబాద్ లోని కుషాయిగూడ పరిధిలోని శ్రీవినాయక నగల దుకాణంలో ఈనెల 3వ తేదీన చోరీకి పాల్పడిన దొంగలను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌కు చెందిన ఈ దోపిడీ దొంగల ముఠా సంఘటన అనంతరం రైల్లో స్వరాష్ట్రానికి వెళ్తోందన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. వారి సహకారంతో సికింద్రాబాద్-ధనపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్న దొంగలను అరెస్టు చేశారు. నిందితులంతా బీహార్‌లోని ఆరారియా జిల్లా కతిహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే...ఈనెల 3న నగల దుకాణం గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు సీసీ కెమెరాల తీగలను కట్ చేశారు. దీంతో షాపు యజమాని సెల్ ఫోన్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్లింది. అప్రమత్తమైన యజమాని దుకాణం వద్దకు చేరుకున్నా, అప్పటికే దొంగలు బంగారం, వెండి నగలతో వుడాయించారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దొంగల కదలికలను అంచనా వేసి రైలులో ప్రయాణిస్తున్నట్లు గుర్తించి వలవేసి పట్టుకున్నారు.