chandryan-2: చందమామను ముద్దాడే సమయం.. మరో 16 గంటల్లో జాబిల్లిపై ‘విక్రమ్’ ల్యాండర్!
- ఈరోజు అర్ధరాత్రి దాటాక సాఫ్ట్ ల్యాండింగ్
- 48 రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెర
- విజయవంతమైతే దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలిదేశం మనదే
ఇస్రో శాస్త్రవేత్తల కష్టానికి ఫలితం...దేశ ప్రజలు ఉత్కంఠతో దాదాపు 48 రోజుల నిరీక్షణకు ఫలితం... మరో 16 గంటల్లో అందాల చందమామపై భారత్ పంపిన ‘విక్రమ్’ ల్యాండ్ రోవర్ దిగనుంది. అంతా అనుకున్నట్టు సవ్యంగా జరిగితే ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 నుంచి 2 గంటల మధ్య విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగుతుంది. జూలై 22న ఇస్రో తన చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ వ్యోమనౌక దాదాపు మూడు లక్షల కిలోమీటర్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం పూర్తి చేసింది. వారం రోజుల క్రితం ఈ స్పేస్ క్రాఫ్ట్ జాబిల్లికి మరింత చేరువైంది.
ఈనెల 2వ తేదీన ఆర్బిటర్ నుంచి విజయవంతంగా వేరు పడిన విక్రమ్ ల్యాండర్ పలు దశల్లో కక్ష్య మార్చుకుంటూ ప్రస్తుతం 35/101 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోంది. ఈ ప్రయోగంలో చివరి ఘట్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ ఈరోజు అర్ధరాత్రి తర్వాత జరుగుతుంది. ల్యాండర్‌లోని కెమెరాలు ప్రతి సెకనుకు అది దిగాల్సిన ప్రాంతంలోని ఫొటోలను పంపుతాయి. వీటిని విశ్లేషించిన అనంతరం ల్యాండర్ దిగాల్సిన చోటును శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. ఇదే కీలక ఘట్టం.
ల్యాండర్‌లో ఐదు రాకెట్ ఇంజన్లున్నాయి. వీటిని భూమిపై నుంచే నియంత్రించాలి. ముందు ల్యాండర్ వేగం తగ్గించి, స్థిరత్వాన్ని సాధించి అనంతరం సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఆదేశాలు ఇవ్వాలి. ల్యాండర్ దిగేటప్పుడు 3.6 కిలోమీటర్ల వేగాన్ని దాటకుండా చూడాలి. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. వీటన్నింటినీ ఇస్రో శాస్త్రవేత్తలు ఎలా అధిగమిస్తారన్న దానిపై ప్రయోగం విజయం ఆధారపడి ఉంటుంది. ఇక, ఏమిటీ ల్యాండర్, రోవర్ ప్రత్యేకత అంటే...
- భారత్ అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయి జ్ఞాపకార్థం ల్యాండర్‌కు ‘విక్రమ్’ పేరు పెట్టారు. దీని బరువు 1471 కిలోలు. ఇది 14 రోజుల పాటు పనిచేస్తుంది. రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్‌లో దీని పాత్రే కీలకం.
- ల్యాండర్‌లోని ఆరు చక్రాల రోవర్ పేరు ప్రజ్ఞాన్. దీని బరువు 27 కిలోలు. పరిశోధనలు చేసేది ఇదే.
- సౌరశక్తి సాయంతో ఇది 500 మీటర్ల పరిధిలో ప్రయాణించి ఎక్స్‌రే కిరణాలను ప్రసరింపజేస్తూ చంద్రుని ఉపరితలంపై ఏయే మూలకాలు ఉన్నాయో గుర్తిస్తుంది.
- 50 ఏళ్ల జాబిల్లి యాత్రలో దక్షిణ ధ్రువంపై ఇప్పటి వరకు ఏ దేశం ప్రయోగాలు చేయలేదు. మొదటి ప్రయత్నంలోనే దక్షిణ ధ్రువం చేరిన దేశంగా భారత్ చరిత్ర లిఖిస్తుంది.
- ఇప్పటి వరకు జాబిల్లిని అందుకున్న అమెరికా, రష్యా, చైనా సరసన మన దేశం చేరుతుంది.