Kurnool District: కోట్లకు పడగలెత్తిన పాణ్యం డిప్యూటీ తహసీల్దార్ .. ఏసీబీ సోదాల్లో బయటపడిన అక్రమాస్తులు

  • ఏసీబీ సోదాల్లో కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు
  • కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం
  • ఉద్యోగంలో చేరినప్పుడు ఆయన వేతనం నెలకు రూ.1800

కర్నూలు జిల్లా పాణ్యం మండలం డిప్యూటీ తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు అక్రమార్జన బయటపడింది. గురువారం ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో కోట్ల రూపాయల అక్రమాస్తులు వెలుగుచూశాయి. కోవెలకుంట్ల, నంద్యాలలోని ఆయన నివాసాలతోపాటు పాణ్యం మండలం కొండజూటురులోని ఆయన మామగారి నివాసంలోనూ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.

నంద్యాలలోని ఆయన అద్దె ఇంట్లో  రూ.1.60 లక్షల నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు, కోవెలకుంట్లలో జీ ప్లస్ 3 భవనంతోపాటు మరో మూడు నివాస గృహాలు,  రూ.11.60 లక్షల విలువ చేసే 4.64 ఎకరాల వ్యవసాయ భూములు, రూ.20లక్షల విలువ చేసే ఇన్నోవా కారు, ఒక ట్రాక్టర్‌, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.25 లక్షల విలువ చేసే ఎల్‌ఐసీ బాండ్లు, కోవెలకుంట్లలోని ఆంధ్రప్రగతి బ్యాంకు లాకరులో రూ.1.50లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1.5 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో రూ.5 కోట్ల పైమాటేనని  ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.

శ్రీనివాసులు తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మరణించడంతో, కారుణ్య నియామకం కింద 2004లో ఈయన జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పట్లో ఆయన జీతం రూ.1800 మాత్రమే. తర్వాత జిల్లాలోని పలు ఎమ్మార్వో కార్యాలయాల్లో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఐగా పనిచేశారు. ఈ క్రమంలో అక్రమార్జనకు రుచి మరిగి ఎడాపెడా లంచాలతో కోట్లు కూడబెట్టారు. మరోపక్క, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన శ్రీనివాసులు భార్య హరిత కూడా డిప్యూటీ తహసీల్దార్‌గా ఇటీవలే ఉద్యోగం సంపాదించారు.  

Kurnool District
Panyam
MRO
  • Loading...

More Telugu News