mumbai: అకాశహర్మ్యం నుంచి జాలువారే జలపాతం... ప్రకృతి ప్రసాదిత సోయగం
- వర్షాలతో ముంబయిలోని ఓ అపార్ట్‌మెంట్లో అద్భుత దృశ్యం
- టెర్రస్‌పై నీరు నిల్చుండి పోవడంతో ఇలా
- ఆశ్చర్యంగా తిలకించిన నివాసితులు
ఎత్తయిన కొండల నుంచి జాలువారే జలపాతాన్ని చూస్తే మనసు పరవశిస్తుంది. కొండకోనల్లోనూ, నదీ ప్రవాహాల వద్ద ఇటువంటి అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. కానీ కాంక్రీట్ జంగిల్ వంటి ముంబయి మహా నగరంలో ఆకాశహర్మ్యం నుంచి జాలువారే జలపాతం కనువిందు చేస్తే ఎలా ఉంటుంది? కన్నుల పండువే కదా? ముంబయి వాసులకు ఇటువంటి దృశ్యమే కనువిందు చేసింది. అయితే ఇదేదో జలపాతం కాదు. ఆర్థిక రాజధానిని వర్షాలు ముంచెత్తుతుండడంతో ఓ నలభై అంతస్తుల భవనం టెర్రస్‌పై నిలబడిపోయిన నీరు ఇలా జాలువారి ఆనందాన్ని పంచింది.
వివరాల్లోకి వెళితే...దక్షిణ ముంబయిలో ఓ నలభై అంతస్తుల భవనంపై నుంచి జలపాతంలా నీరు జాలువారడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇటీవల చైనాలో అక్కడి ఇంజనీర్లు సృష్టించిన కృత్రిమ జలపాతాన్ని గుర్తుకు తెచ్చుకుని ముంబయిలోనూ అటువంటి ఏర్పాటు చేశారని భావించారు. అయితే అదేం కాదని, టెర్రస్‌పై నిలిచిన నీరు ఒక్కసారిగా వదిలేయడంతో ఇలా జలపాతంలా దర్శనమిచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
వెంటనే తమ చేతిలోని స్మార్ట్ ఫోన్లకు పని చెప్పారు. వీడియోలు, ఫొటోలతో హడావుడి చేశారు. వీరిలాగే ఈ దృశ్యాన్ని భవన నిర్మాణ సంస్థ ఈఎంఏ పార్టనర్స్ సహ వ్యవస్థాపకుడు కె.సుదర్శన్ కూడా చిత్రీకరించి ట్వీట్ చేయడంతో నెటిజన్లను ఈ వీడియో విపరీతంగా ఆకర్షిస్తోంది.