auto: ఆటోకు రూ. 47,500 జరిమానా.. చెల్లించడం తన వల్ల కాదని జైలుకు పంపమన్న డ్రైవర్
- వివిధ ఉల్లంఘనల కింద భారీ జరిమానా
- అంత మొత్తాన్ని తాను చెల్లించలేనని తెగేసి చెప్పి డ్రైవర్
- ఆటోను సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మద్యం తాగి ఆటో నడిపిన ఓ డ్రైవర్‌కు కొత్త వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.47,500 జరిమానా విధించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిందీ ఘటన. నిన్న మధ్యాహ్నం నగరంలోని ఆచార్య విహార్ చక్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆటో డ్రైవర్ తాగి ఉండడంతో అడ్డుకున్నారు. వాహన పత్రాలు లేకపోవడంతో ఇతర ఉల్లంఘనల కింద భారీ చలాన్ రాశారు.
సాధారణ తప్పు కింద రూ. 500, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.5 వేలు, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.10 వేలు, తాగి నడిపినందుకు రూ. 10 వేలు, పొల్యూషన్ నిబంధనను ఉల్లంఘించినందుకు రూ.10 వేలు, అనుమతి లేని వ్యక్తితో వాహనం నడిపిస్తున్నందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ పత్రాలు లేనందుకు రూ.5 వేలు, ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్నందుకు రూ.2 వేలు కలిపి మొత్తంగా రూ.47,500 వడ్డించారు.
జరిమానాను వెంటనే చంద్రశేఖర్‌పూర్‌లోని డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లో చెల్లించాలని ఆదేశించారు. తాను తాగి ఉన్నానని అంగీకరించిన ఆటో డ్రైవర్ హరిబంధు కన్హర్.. అంత మొత్తాన్ని తాను చెల్లించలేనని, తన ఆటోను సీజ్ చేయాలని, లేదంటే తనను జైలుకు పంపాలని అధికారులను కోరాడు. ఆటోకు సంబంధించిన అన్ని పత్రాలు ఇంటి వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారమే జరిమానా విధించామని పేర్కొన్న అధికారులు, ఆటోను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.