Punjab blast: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో.. 23కి చేరిన మృతుల సంఖ్య

  • క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమం
  • పేలుడు ధాటికి సమీపంలోని గురుద్వారాలో భోజనం చేస్తున్న వ్యక్తి మృతి
  • విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

పంజాబ్‌లోని బటాలాలో నిన్న మధ్యాహ్నం బాణసంచా కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ ఘటనలో మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. సమద్ రోడ్డులోని నివాస ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని అక్రమంగా నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. క్షతగాత్రులకు వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించాలని గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ విపుల్ ఉజ్వల్ ఆదేశించారు.

భారీ పేలుడు కావడంతో ప్యాక్టరీని ఆనుకుని ఉన్న నాలుగు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ఇందులో ఓ గురుద్వారా, ఓ కంప్యూటర్ సెంటర్, కార్ గ్యారేజ్ ఉన్నాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వినిపించినట్టు స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి గురుద్వారా బేస్‌మెంట్‌పై భోజనం చేస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు. పేలుడుతో ఇటుకలు ఎగిరి వచ్చి మీద పడడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పేలుడు కారణంగా సమీపంలో పార్క్ చేసిన ఓ కారు డ్రైనేజీలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీడియోల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

Punjab blast
explosion
firecracker factory
Batala
  • Loading...

More Telugu News