bandaru dattatreya: దత్తాత్రేయ ఇంట్లో కలకలం రేపిన చిన్నపాటి కత్తి.. భద్రత కట్టుదిట్టం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0854a86896692ca55761ef7dd6ea9f3ef98eefad.jpg)
- దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించిన కేంద్రం
- ఆయన ఇంటికి పెరిగిన అభిమానుల తాకిడి
- నిన్న ఫొటోలు దిగుతున్న సమయంలో తోపులాట
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో చిన్నపాటి కత్తి కలకలం రేపింది. దత్తాత్రేయను కేంద్రం ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయనను కలిసి అభినందనలు తెలిపేందుకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పోటెత్తుతున్నారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగుతున్నారు.
నిన్న కూడా దత్తన్న ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వీరంతా మధ్యాహ్నం 12 గంటల సమయంలో దత్తాత్రేయతో ఫొటోలు దిగుతున్న సమయంలో స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ పెన్సిల్ కట్టర్ (చిన్న కత్తి) కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దానిని గుర్తించిన కార్యకర్తలు భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన తర్వాత దత్తాత్రేయ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.