Masood Azhar: దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, మసూద్ అజర్‌లను ఉగ్రవాదులుగా ప్రకటించిన భారత్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-685f7939cfca1e664794b3f6789d9e1e73af69aa.jpg)
- యూఏపీఏ చట్టానికి సవరణలు చేసిన నెల రోజుల్లోనే కీలక ప్రకటన
- ఇప్పటి వరకు సంస్థలనే ఇలా ప్రకటించేవారు
- మున్ముందు మరింతమందిని ఈ జాబితాలో చేర్చనున్నట్టు వెల్లడి
కరుడుగట్టిన ఉగ్రవాదులు, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లక్వీ, మసూద్‌లను కొత్త ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్‌లను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టం 1967 ప్రకారం వ్యక్తిగత ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. యూఏపీఏ చట్టానికి చేసిన కీలకమైన సవరణలను పార్లమెంట్ ఆమోదించిన నెల రోజుల్లోనే ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
యూఏపీఏ చట్ట సవరణ ప్రకారం వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించొచ్చు. గతంలో ఏవైనా గ్రూపులు, సంస్థలను మాత్రమే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. ఇప్పుడు యూఏపీఏ చట్టానికి సవరణలు చేయడంతో వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అవకాశం దక్కింది. మౌలానా మసూద్ అజర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడని, కాబట్టి అతడిని ఈ చట్టం కింద ఉగ్రవాదిగా పేర్కొన్నట్టు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, హఫీజ్ ముహమ్మద్ సయీద్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని, అందుకే అతడిని కూడా ఈ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించినట్టు కేంద్రం వివరించింది. కాగా, పైన పేర్కొన్న నలుగురిపైనా కేంద్రం ఇప్పటికే రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. మున్ముందు ఈ జాబితాలో మరింతమంది పేర్లను చేర్చనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.