Jagan: యరపతినేని కేసు సీబీఐకి అప్పగింత... జగన్ సంచలన నిర్ణయం!
- యరపతినేనిపై కుట్ర చేస్తున్నారంటున్న టీడీపీ
- ప్రతీకార రాజకీయాలు లేవని చెప్పేందుకే సీబీఐ విచారణ
- హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కేసులపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ, వైఎస్ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. పల్నాడులో ఆయన అక్రమంగా గనులను తవ్వి, వందల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని ఆరోపణలు రాగా, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసులు ఒక్కొక్కటిగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
యరపతినేనిపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ప్రతీకార రాజకీయాల్లో భాగంగా ఆయన్ను ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుండగా, వీటిని తిప్పి కొట్టేందుకే జగన్, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యరపతినేని అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని, అందువల్లే సీబీఐకి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. ఇదే విషయాన్ని కేసులను విచారిస్తున్న హైకోర్టుకు తెలిపినట్టు పార్టీ నేత ఒకరు తెలియజేశారు. కాగా, జగన్ సర్కారు వచ్చాక ఓ కేసును సీబీఐకి అప్పగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.