Andhra Pradesh: ఫ్యాక్షనిస్టులంతా టీడీపీలోనే ఉన్నారు.. త్వరలోనే అన్నీ బయటపెడతాం!: గడికోట శ్రీకాంత్ రెడ్డి
- టీడీపీ హయాంలో చాలా అరాచకాలు జరిగాయి
- వాటిపై విచారణకు సిద్ధమా?
- తాడేపల్లిలో మీడియాతో ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక అరాచకాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. టీడీపీ హయాంలో చాలామంది వైసీపీ నేతలు, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు.
కుంభకోణాలు, అరాచకాలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగాయని పునరుద్ఘాటించారు. టీడీపీ అరాచకాలు చేసి దాన్ని వైసీపీపై నెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో గడికోట మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై విచారణకు ఆ పార్టీ సిద్ధమా? అని గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.
టీడీపీ నేతలకు నిజంగా ధైర్యం ఉంటే ‘తెలుగుదేశం బాధితుల శిబిరం’ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. నరసరావుపేటలో కనుక టీడీపీ బాధితుల శిబిరం పెడితే వేలాది మంది కోడెల ట్యాక్స్(కె-ట్యాక్స్) బాధితులు వస్తారని ఎద్దేవా చేశారు. శిబిరాల పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఫ్యాక్షనిస్టులంతా టీడీపీలోనే ఉన్నారనీ, త్వరలోనే బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలను వెనక్కు పంపేందుకు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడికోట ఆరోపించారు. ఏపీలో పోలీసులు నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.