Kartarpur: కర్తార్ పూర్ కారిడార్ పై నేడు చివరి విడత చర్చలు జరపనున్న భారత్-పాక్ అధికారులు
- చివరి రోజులను కర్తార్ పూర్ లో గడిపిన గురు నానక్
- పాకిస్థాన్ భూభాగంలో వున్న గురుద్వారా కర్తార్ పూర్ సాహిబ్
- 5 వేల మంది భారతీయ సిక్కు యాత్రికులకు సౌలభ్యం
పంజాబ్ లోని అమృత్ సర్ వద్ద ఉన్న అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని కర్తార్ పూర్ కారిడార్ పై నేడు భారత్, పాకిస్థాన్ అధికారులు మూడో విడత చర్చలు జరపనున్నారు. కర్తార్ పూర్ కారిడార్ కు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాన్ని నేడు ఖరారు చేయనున్నారు.
ఇందులో భాగంగా తాత్కాలిక రహదారి అలైన్ మెంట్ పై కూడా టెక్నికల్ లెవెల్ సమావేశం జరగనుంది. జూలై 14న ఇరు దేశాల మధ్య ఈ అంశంపై రెండో విడత చర్చలు జరిగాయి. ఇస్లామాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో రావీ నదిపై బ్రిడ్జిని నిర్మించేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. ఈ నిర్మాణం పూర్తయితే గురుద్వారా కర్తార్ పూర్ సాహిబ్ కు యాత్రికులు వెళ్లేందుకు అనువుగా ఉంటుంది.
ఇక భారత్ నుంచి ప్రతి ఏటా 5 వేల మంది యాత్రికులు గురుద్వారాను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఒప్పందం ప్రకారం యాత్రికులు ఒంటరిగా, గ్రూపులుగా లేదా కాలినడకన వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోవైపు, గురుద్వారా కర్తార్ పూర్ సాహిబ్ కు వెళ్లే యాత్రికుల విషయంలో... భారత వ్యతిరేక చర్యలకు పాల్పడబోమని పాకిస్థాన్ ఇప్పటికే హామీ ఇచ్చింది. అక్టోబర్ 31కి ఈ కారిడార్ పూర్తి కావాల్సి ఉంది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ తన చివరి రోజులను కర్తార్ పూర్ లో గడిపారు. దీంతో, ఆ ప్రాంతాన్ని సిక్కు మతస్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.