Srisailam: జూరాల నుంచి శ్రీశైలానికి పెరుగుతున్న వరద!

  • 15 వేల క్యూసెక్కులను దాటిన వరద
  • ప్రస్తుతం 877 అడుగులను దాటిన నీటిమట్టం
  • అన్ని కాలువలకూ నీటి విడుదల

కన్నడ నాట కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి మరోసారి భారీ వరద మొదలైంది. నిన్న సాయంత్రానికి జూరాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 7,700 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, ఆ మొత్తం ఈ ఉదయం 15 వేల క్యూసెక్కులను దాటింది. ఆల్మట్టి, తుంగభద్ర, భీమ జలాశయాల నుంచి కూడా నీటి విడుదల మొదలైంది. దీంతో పరిస్థితిని బట్టి, మరో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 877.80 అడుగుల నీటి మట్టం ఉండగా, ఇది 177.14 టీఎంసీలకు సమానం. జలాశయం నుంచి విద్యుత్ ను మాత్రం ఉత్పత్తి చేయడం లేదు. ఇదే సమయంలో పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 24,500 క్యూసెక్కులు, హంద్రీ నీవాకు 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద మాత్రం జల సందడి నెలకొంది.

  • Loading...

More Telugu News