APSRTC: ఇకపై ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులే.... సీఎం జగన్ సూచనప్రాయ అంగీకారం!
- వెల్లడించిన ఏపీ మంత్రి పేర్ని నాని
- ఆర్టీసీ విలీనంపై నివేదిక సమర్పించిన కమిటీ
- రేపు క్యాబినెట్ ముందుకు నివేదిక
రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనం దిశగా కీలక ముందడుగు పడింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఏర్పాటు చేసిన కమిటీ తమ నివేదికను సీఎంకు అందజేసింది. దీనిని పరిశీలించిన ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు సూచనప్రాయంగా అంగీకరించారని ఏపీ రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
ఇకపై ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పారు. రేపు ఈ నివేదిక క్యాబినెట్ లో చర్చకు వస్తుందని, ఆమోద ముద్ర వేసిన అనంతరం దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (ప్రజా రవాణా సంస్థ) ఏర్పాటు చేస్తామని, ఆర్టీసీ ఉద్యోగులు ఈ ప్రజా రవాణా సంస్థ పరిధిలోకి వస్తారని మంత్రి వివరించారు.
కాగా, కమిటీ అందించిన నివేదికపై సమీక్ష నిర్వహించిన జగన్ కు కమిటీ సభ్యులు పలు అంశాలను వివరించారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచే విషయమై ప్రతిపాదించారు. ఆర్టీసీలోకి దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ అంశాలపై రేపు జరిగే క్యాబినెట్ భేటీలో చర్చిస్తారు.