Cricket: టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్!

  • 2021 ప్రపంచకప్ పై దృష్టి సారించిన మిథాలీ
  • బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పిన క్రీడాకారిణి
  • 2006లో టీ20ల్లో అరంగేట్రం చేసిన మిథాలీ

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాను అంతర్జాతీయ టీ20 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 2021లో జరిగే వన్డే ప్రపంచకప్ కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిథాలీ తెలిపింది. భారత్ కు ప్రపంచకప్ సాధించిపెట్టడం తన కల అనీ, తనకు సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొంది. అలాగే త్వరలోనే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడబోతున్న భారత జట్టుకు శుభాకాంక్షలు చెప్పింది.

మిథాలీరాజ్ తొలిసారి 2006లో ఇంగ్లాండ్ లోని డెర్బీలో మొదటి టీ20 మ్యాచ్ ఆడింది. ఆమె మూడు టీ20 ప్రపంచకప్ లు సహా 32 టీ20ల్లో భారత జట్టుకు నేతృత్వం వహించింది. తన కెరీర్ లో మొత్తం 89 టీ20 మ్యాచ్ లు ఆడిన మిథాలీ, 2,364 పరుగులు చేసింది. ఇందులో 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మిథాలీ టీ20లో గరిష్టంగా 97 పరుగులు సాధించింది. ఆమె చివరిసారిగా ఇంగ్లాండ్ జట్టుపై ఈ ఏడాది మార్చి 9న చిట్టచివరి టీ20 మ్యాచ్ ఆడింది.

గతంలో భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీల మధ్య విభేదాలు తలెత్తాయి. గతేడాది నవంబర్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఆమెను పక్కనపెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనికితోడు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ నుంచి మిథాలీని తప్పించారు. ఈ నేపథ్యంలోనే మిథాలీ టీ20 విభాగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News