Mohammad Shami: క్రికెటర్ మహ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్ పై స్పందించిన భార్య హసీన్ జహాన్
- గృహహింస కేసులో షమీపై వారెంట్
- యూపీ పోలీసులు తనను వేధించడానికి ప్రయత్నించారంటూ ఆరోపించిన షమీ భార్య
- న్యాయం కోసం సంవత్సరం నుంచి పోరాడుతున్నానంటూ వెల్లడి
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై గృహహింస కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. షమీ, అతని కుటుంబ సభ్యులు తనపై పలుమార్లు దాడి చేశారంటూ భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు చేసింది. దీనిపైనే వారెంట్ జారీ అయింది. దీనిపై హసీన్ జహాన్ స్పందించారు. తాను పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళను కాకపోయుంటే, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం అవకపోయుంటే తాను ఇక్కడ సురక్షితంగా ఉండేదాన్ని కాదని వ్యాఖ్యానించారు.
అమ్రోహా (ఉత్తరప్రదేశ్) పోలీసులు తనను, తన కుమార్తెనూ వేధించడానికి ప్రయత్నించారని, దేవుడి దయతో వాళ్ల ప్రయత్నాలు సఫలం కాలేదని అన్నారు. న్యాయవ్యవస్థకు తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, న్యాయం కోసం ఏడాదిగా పోరాడుతున్నానని తెలిపారు. షమీ ఓ పెద్ద క్రికెటర్ కావడంతో, తనను తాను చాలా శక్తిమంతుడ్నని భావిస్తుంటాడని హసీన్ జహాన్ వ్యాఖ్యానించారు.