Assam: జాతీయ పౌరసత్వ జాబితాలో చోటు దక్కని వారికి న్యాయ సహాయం: అసోం హామీ
- ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు లభించని వారికి ప్రభుత్వం భరోసా
- ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా
- వారు కూడా అన్ని హక్కులూ ఉపయోగించుకోవచ్చన్న హోం మంత్రిత్వ శాఖ
జాతీయ పౌరసత్వ జాబితా(ఎన్ఆర్‌సీ)లో చోటు దక్కని వారికి చట్టపరమైన సాయం అందించనున్నట్టు అసోం ప్రభుత్వం ప్రకటించింది. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా నుంచి తొలగింపునకు గురైన వారికి చట్టపరమైన సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు అసోం హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. జిల్లా న్యాయ సేవల అధికారులు (డీఎల్ఎస్ఏ) ద్వారా ఈ సేవలు అందించనున్నట్టు తెలిపింది.
ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కని వారు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, జాబితా నుంచి మినహాయించిన వారిని అధికారులు అదుపులోకి తీసుకోబోరని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హామీ ఇచ్చారు. అటువంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామన్నారు.
చట్ట ప్రకారం వారికి లభించే అన్ని ప్రత్యామ్నాయాలు పూర్తయేంత వరకు వారు మునుపటిలానే అన్ని హక్కులు అనుభవించవచ్చని పేర్కొంది. వారు కూడా ఇతర పౌరుల్లానే ఉపాధి, విద్య, ఆస్తి తదితర హక్కులను అనుభవించవచ్చని వివరించింది.