Assam: అసోంలో ఎన్నార్సీ ప్రకటనపై.. కేంద్రంపై మండిపడ్డ జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్!

  • అసమంజసంగా ఈ నిర్ణయం తీసుకున్నారు
  • భారతీయులు స్వదేశంలోనే విదేశీయులయ్యారు
  • కేంద్రం జాతీయ భద్రత అంశాలను దృష్టిలో పెట్టుకోలేదు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తొలుత అస్సాంలో ఈ ఎన్నార్సీని ప్రవేశపెట్టిన ప్రభుత్వం 19.06 లక్షల మంది భారతీయులు కాదని ప్రకటించింది. వీరంతా విదేశీయుల ట్రైబ్యునల్స్ లో 120 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జనతాదళ్ యునైటెడ్ నేత ప్రశాంత్ కిశోర్ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అసమంజసంగా తెచ్చిన ఎన్నార్సీ ద్వారా లక్షలాది మంది భారతీయులు స్వదేశంలోనే విదేశీయులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో కేంద్రం జాతీయ భద్రత విషయంలో తలెత్తే వ్యూహాత్మక సమస్యలను దృష్టిలో పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించాలన్న తప్పుడు ధోరణి కారణంగా ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు. కాగా, ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంతవరకూ స్పందించలేదు. కాగా, ఎన్నార్సీ నిర్ణయాన్ని ప్రజలు విదేశీయుల ట్రైబ్యునల్స్ తో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా సవాలు చేయవచ్చు.

  • Loading...

More Telugu News