Pakistan: పాక్ విదేశాంగ కార్యాలయానికి చేరుకున్న భారత్ డిప్యూటీ హైకమిషనర్.. త్వరలో జాదవ్‌ను కలిసే అవకాశం
- గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైల్లో మగ్గుతున్న కుల భూషణ్
- ఉరిశిక్షను నిలుపుదల చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం
- మూడేళ్ల ప్రయత్నాల తర్వాత దిగివచ్చిన దాయాది
పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్‌ను భారత్ అధికారులు త్వరలో కలిసేందుకు మార్గం సుగమమైంది. జాదవ్‌ను కలిసేందుకు భారత్ డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయానికి చేరుకున్నారు. భారత్ నౌకాదళంలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కులభూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ గూఢచర్యం కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనికి ఉరిశిక్ష కూడా విధించింది.
అయితే అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి, అంతర్జాతీయ న్యాయస్థానం ఉరి శిక్షను నిలుపుదల చేయడంతో ప్రస్తుతం పాక్ జైల్లోనే జాదవ్ మగ్గుతున్నాడు. అతనికి దౌత్యపరమైన సాయం అందించేందుకు మూడేళ్లుగా భారత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు దాయాది పాకిస్థాన్ మోకాలడ్డుతూ వస్తోంది. అంతర్జాతీయ కోర్టు మొట్టికాయలు వేయడంతో ఎట్టకేలకు దిగివచ్చిన పాకిస్థాన్ జాదవ్‌ను కలిసేందుకు అంగీకరించింది. ‘ఐసీజే ఆదేశాలకు అనుగుణంగా పాక్ సానుకూల వాతావరణం కల్పిస్తుందని ఆశిస్తున్నాం. జాదవ్‌తో స్వేచ్ఛగా, ప్రభావవంతంగా సమావేశం జరుగుతుందనుకుంటున్నా’ అని గౌరవ్ ఆహ్లూవాలియా తెలిపారు.