Hyderabad: మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ గణేషునికి తొలిపూజ
- పూజల్లో పాల్గొననున్న గవర్నర్ నరసింహన్ దంపతులు
- ఈ ఏడాది కొలువుదీరిన ద్వాదశాదిత్య మహాగణపతి
- 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో 61అడుగుల ఎత్తు విగ్రహం
హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ గణపతి తొలిపూజకు సిద్ధమయ్యాడు. మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని కొలువుదీర్చనున్నారు. పూజల్లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొంటారు.
దేశంలోనే ఎంతోపేరు ప్రఖ్యాతులున్న ఖైరతాబాద్ వినాయకుడిని ఈసారి నిర్వాహకులు 12 తలలతో నిలబెట్టారు. 24 చేతులు, 12 సర్పాల సంరక్షణలో 61 అడుగుల నిలువెత్తు ద్వాదశాదిత్య మహాగణపతిని ఈ ఏడాది కొలువుదీర్చారు. విగ్రహం కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చుచేసిన నిర్వాహకులు పూలమాలలు, ఇతర అలంకరణ కోసమే రూ.2 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. బంతి పూలు (పసుపు, ఎరువు) 300 కిలోలు, చామంతి వంద కిలోలు, ఆకులు 200 కిలోలు, అశోక మొక్కలు వంద, అరటి మొక్కలు 30 అలంకరణలో వినియోగిస్తున్నారు.