KCR: దేంట్లో అభివృద్ధి చేయకపోయినా మద్యం అమ్మకాల్లో మాత్రం తెలంగాణను నెంబర్ వన్ చేశారు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్
- వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జలసాధన సభ
- హాజరైన టి-కాంగ్రెస్ నేతలు
- కేసీఆర్ పై ధ్వజమెత్తిన హస్తం వర్గీయులు
తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఇవాళ వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లిలో జలసాధన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ సర్కారుపై ధ్వజమెత్తారు. ఈటల వ్యవహారంతో టీఆర్ఎస్ లో తిరుగుబాట్లు మొదలయ్యాయని అన్నారు. దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. దేంట్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా, మద్యం అమ్మకాల్లో, నిరుద్యోగంలో మాత్రం తెలంగాణను నెంబర్ వన్ చేశారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కరెన్సీ మూటల మత్తులో ఫామ్ హౌస్ లో కులుకుతున్నారంటూ విమర్శించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఏడాదిలో నీళ్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పతనం మొదలైనట్టేనని అన్నారు. మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానిస్తూ, తెలంగాణకు సోనియా గాంధీనే ఓనర్ అని వ్యాఖ్యానించారు. తమను కేసీఆర్ ఓడిస్తే, ప్రజలు కవితను ఓడించారని పేర్కొన్నారు.