ganesh ustsav: 12 తలలు...24 చేతులు : ఖైరతాబాద్ వినాయకుడి ప్రత్యేకత ఇది
- పూజకు సిద్ధమైన ఆది దేవుడు
- ఏటా విశేష అలంకరణతో దర్శనమిచ్చే విఘ్ననాయకుడు
- 61 అడుగుల విగ్రహం కోసం రూ.కోటి వ్యయం
వినాయక ఉత్సవాలు అనగానే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడు గుర్తుకు వస్తాడు. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న విగ్రహం ఇది. ఏటా ఏదో ఒక ప్రత్యేకతతో ఇక్కడి నిర్వాహకులు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఉత్సవాల కోసం 61 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 12 తలలు, 24 చేతులు, 7 గుర్రాలతో సూర్యావతారంలోని స్వామివారిని అందంగా ముస్తాబు చేశారు. శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహానికి తుదిమెరుగులు దిద్దారు.
ఇందుకోసం కోటిరూపాయలు నిర్వాహకులు వ్యయం చేశారు. ప్రముఖ సిద్దాంతి గౌరిభట్ల విఠలశర్మ సూచనతో గణేషుడి విగ్రహాన్ని ఉత్సవ కమిటీ తయారు చేసింది. ఇది వికారనామ సంవత్సరం కావడంతో విగ్రహాలకు అధిపతి అయిన సూరీడు రూపంలో గణపతిని తయారుచేయించారు. ఈ వినాయకుడిని పూజిస్తే లోకకల్యాణం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని భక్తుల నమ్మకం. 1 రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో స్వామివారు భక్తులను ఆశీర్వదించనున్నారు.