Adari Anand: ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎదురు దెబ్బ... వైసీపీలో చేరేందుకు జగన్ వద్దకు అడారి ఆనంద్!
- మరికాసేపట్లో వైసీపీలోకి
- వెంట విశాఖ డెయిరీ 12 మంది డైరెక్టర్లు కూడా
- యలమంచిలి మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ రమాకుమారి సైతం
ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గడచిన లోక్ సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయిన అడారీ ఆనంద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ ఉదయం ఆయన భారీ ర్యాలీతో జగన్ వద్దకు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన వైసీపీ కండువాను కప్పుకోనున్నారు.
విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుమారుడిగా లోకానికి పరిచయమైన ఆనంద్, ప్రస్తుతం కృషి ట్రస్ట్ ఛైర్మన్ గా పని చేస్తున్నారు. కాగా, అడారి ఆనంద్ తో పాటు యలమంచిలి మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ రమాకుమారి, 12 మంది డెయిరీ డైరెక్టర్లు సైతం వైసీపీలో చేరనున్నారు. దీంతో దాదాపు మూడు దశాబ్ధాలుగా టీడీపీ నేతల అధీనంలో ఉన్న విశాఖ డెయిరీ ఇప్పుడు వైసీపీ గ్రిప్‌లోకి వచ్చినట్లయింది.