Telangana: తెలంగాణ కొత్త గవర్నర్ గా తమిళ సై సౌందరరాజన్... హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ
- ఉత్తర్వులు వెలువరించిన కేంద్రం
- ఇటీవలి ఎన్నికల్లో కనిమోళిపై పోటీ చేసిన సౌందరరాజన్
- ఓడిపోయినా ఆమె సేవలకు లభించిన ప్రతిఫలం
తెలంగాణకు కొత్త గవర్నర్ గా తమిళ సై సౌందర్ రాజన్ ను నియమిస్తున్నట్టు కేంద్ర హోమ్ శాఖ కొద్దిసేపటి క్రితం ఆదేశాలను జారీ చేసింది. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ గా బండారు దత్తాత్రేయను నియమిస్తున్నట్టు ప్రకటించింది.
తమిళనాడు బీజేపీ యువ మహిళా నేతగా తమిళ సై సౌందర్ రాజన్ పరిచయం అక్కర్లేని పేరన్న సంగతి అందరికీ తెలిసిందే. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే మహిళా నేత కనిమోళితో, తూత్తుకుడి నియోజకవర్గంలో పోటీపడి ఓటమి పాలయ్యారు. స్టెరిలైట్ కర్మాగారంపై పోరాడారు. బీజేపీకి ఆమె చేసిన సేవలకు ఇంతకాలానికి ప్రతిఫలం లభించింది.
ఇదిలావుండగా, మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కోశ్యారిని నియమిస్తూ కూడా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ గవర్నర్ గా కల్ రాజ్ మిశ్రాను, కేరళకు ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ను నియమించింది. దీంతో, మొత్తం మీద ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చినట్లు అయింది.